Monday, 21 September 2015

'కబలి'లో అందాల ఐశ్వర్యం.!


'రోబో' సినిమాలో రజనీకాంత్‌ సరసన హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్‌ అందాల ఐశ్వర్యం తాజాగా మరోమారు రజనీకాంత్‌తో జతకట్టనుందట. 'కబలి' సినిమా కోసం రజనీకాంత్‌ స్వయంగా ఐశ్వర్యారాయ్‌తో మాట్లాడారంటూ తాజాగా తమిళ సినీ వర్గాల్లో గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఐష్‌ నటించేది హీరోయిన్‌గా కాదనీ, ఓ చిన్న పాత్రలో మాత్రమేననీ తెలుస్తోంది.  'కబలి' సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటిస్తోంది. పా రంజిత్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్‌.థాను ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా 'కబలి'ని రూపొందించబోతున్నారట. ఇటీవలే ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది.  ఇక, 'కబలి'లో రజనీకాంత్‌ గెటప్‌ చాలా డిఫరెంట్‌గా కన్పిస్తోంది. గాడ్‌ఫాదర్‌ తరహాలో రజనీకాంత్‌ గెటప్‌ని ఇప్పటికే రిలీజ్‌ చేశారు. అయితే దీంతోపాటుగా క్లీన్‌ షేవ్‌తో స్టయిలిష్‌గా ఇంకో గెటప్‌లో కూడా రజనీకాంత్‌ కనిపిస్తాడట. అయితే ఐశ్వర్యారాయ్‌ నటించే విషయమై చిత్ర దర్శక నిర్మాతలు ఇంకా పెదవి విప్పడంలేదు. ఓ సౌత్‌ సినిమాకి ఐశ్వర్య తాజాగా కమిట్‌ అయ్యిందనే ప్రచారం బాలీవుడ్‌లోనూ షురూ అవడంతో అది 'కబలి' అన్న వాదనలకు బలం చేకూరుతోంది.  ప్రస్తుతం ఐశ్వర్యారాయ్‌ 'జజ్‌బా' అనే బాలీవుడ్‌ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం విదితమే.

No comments:

Post a Comment